మగధను జయించి భారతదేశ చక్రవర్తు లయిన పూర్వాంధ్ర రాజవంశములలో తెలిసినంత వఱ కితఁడే పూర్వుఁడు. ఇతఁడు నిశుంభుఁ డను రాజును జంపి శ్రీకాకుళము రాజధానిగా నాంధ్రమును పాలించెను. ఈ దేశమున కితని వలననే యాంధ్రదేశ మని పేరు వచ్చినది. భీమేశ్వరము, కాళేశ్వరము, శ్రీశైలము- యీ మూఁడు క్షేత్రములకుఁ జుట్టును బెద్ద గోడ కట్టించి యితఁడు త్రిలింగమని పే రాంధ్రమునకుఁ గల్పించెను. ఈయన, తరువాత దేవుఁడుగా పరిగణింపబడి యితని పేర శ్రీకాకుళమున నాధ్రవిష్ణువు నాలయము కట్టింపఁబడినది. కాసుల పురుషోత్తము తన 'యాంధ్రనాయక శతక' మితని మీదనే చెప్పినది! శ్రీకృష్ణదేవరాయలు 'ఆముక్త మాల్యద' వ్రాయుటకుఁ గారణ మీయన కలలో కనఁబడి యాజ్ఞాపించుటయే!
శా : "జో! సామీ! మముఁ గన్న యేలిక! యిదో జోహారు! జోహారు! మా
శ్రీశైలంబునఁ, బెద్దకొండ దరి, గర్వీభూత చేతస్కుఁడై
యీశా రాధన లబ్ద దోర్బలుఁడు దైత్యేంద్రుండు లేఁడా! బుభు
క్షా సంపూర్తికి నోచుకోము గద, కక్కా! వాని దుశ్చేష్టలన్.
జో, జోహరు = నమస్కారము; ఏలిక = పరిపాలకుడు, రాజు; దరి = సమీపము, ప్రక్కన ; గర్వీభూత = మదముతో (అహంకారముతో కూడిన; చేతస్కుఁడు + ఐ = మనస్సు కలిగినవాడై; లబ్ద దోః + బలుడు = భుజబలము పొందినవాడు ; దైత్య + ఇంద్రుడు = రాక్షసరాజు ; బుభుక్ష = ఆకలి; కక్కా = తండ్రీ ; దుశ్చేష్టలు = దుర్మార్గపు పనులు ;
© 2017,www.logili.com All Rights Reserved.