తైల దీపమ్ముల దగ్గర కూర్చుండి
ఆ ఆలు నేర్చితి నమ్మవద్ద
సంధ్య దీపము పెట్టి సద్గురువులు చెప్ప
దైవమున్ మనసార తలచినాను
సీమ నూనెను పోసి సీసలో వెలగెడి
దీపమ్ము ముందు చదివితి నేను
విద్యుత్తు దీపపు వెలుగులో కాన్వెంటు
స్కూళ్ళయందు చదువుకొంటి పిదప
పూర్వాపర సంధ్యలందు అపూర్వమైన
వల్లెవేసిన పాఠాలు వాసి తగ్గె
దీపముల ముందు చదివిన తీరు లెన్ని -
విధములో బాలకృష్ణయ్య వినుము చెపుదు
దీపారాధన చేసిన
పాపములు నశించి పుణ్యఫలము లభించున్
కాపాడబడుదురెప్పుడు
శ్రీ పార్వతి సాక్షిగాను స్థిరపడు బ్రతుకున్
దీపము వెలిగింపుము ముని-
మాపున నీ గృహమునందు మగువా! నియతిన్
నీపతి పిల్లలకెప్పుడు
శ్రీపతి నారాయణుండు సేమము కూర్చున్
ఆయురారోగ్య మైశ్వర్య మవని యందు
స్వర్గ సుఖములు మనసుకు శాంతి దాంతి
బాలకృష్ణాఖ్యుడనియెడు పండితునకు
ఇచ్చుగావుతు లలితమ్మ మెచ్చుకొనుచు
నా బంధువు సహచరుడు ను
ఆబాల్య స్నేహితుండు ఆత్మయుడున్
శ్రీ బాలకృష్ణ శర్మను
శ్రీ బాలాత్రిపుర సుందరీ బ్రోవమ్మా!
కందూరు పద్మనాభయ్య
© 2017,www.logili.com All Rights Reserved.