కార్టూన్ పాఠాలుచెప్పే టీచర్లెవరైనా ఉన్నారా అనడిగాను యాభైయేళ్ల క్రితం. నాకు సరైన సమాధానం దొరక లేదు. ఒకరోజు గీతాల గురువు బాపు గారిని కలిసే మహద్భాగ్యం దక్కింది. ఆయనకీ ఇదే ప్రశ్నకి సమాధానం దొరకలేదని చెప్పారు. 'మరేం చేశారు సార్!' అని భక్తి పూర్వకంగా నోరు మెదిపాను. 'పెద్దవాళ్ళు గీసిన కార్టూన్లు తిరగెయ్యడమే..! ఆ కార్టూన్లే మనకి కార్టూను పాఠాలు నేర్పుతాయి. ఆ కార్టూన్లు గీసిన వాళ్ళే కార్టూను టీచర్లు!' అన్నారు. మహాప్రసాదం ఇప్పటి దాకా మీ కార్టూన్లే ఫాలో అయ్యాను. ఇక ముందు కూడా అదే నా దారి అని మనసులో అనుకున్నాను.
ఆ తర్వాత పలుమార్లు బాపుగారిని కలిసినప్పుడు వారి లైబ్రరీలో మహానుభావుల కార్టూన్ పుస్తకాలు కొన్ని స్పర్శించే పుణ్యం నాకు కలిగింది. క్రమేణా, నేనూ ఒక చిన్న లైబ్రరీ నా డెస్కు కింద పెట్టుకున్నాను. రోజూ ఆ లైబ్రరీ పుస్తకాలు సర్దడం, కార్టూన్ పేజీలు తిరగేయడం, కార్టూన్ టీచర్లతో ప్రైవేటు చెప్పించుకోవడం, కార్టూన్లు గీయడం, ఆనందంగా రోజులు గడపడం చేస్కుంటూ జీవితయానం సాగిస్తున్నాను.
© 2017,www.logili.com All Rights Reserved.