Kuchipudi Nruthya Rupakalu,Sarmagari Ethara Rachanalu,Gnapakalalo Sarma garu
కొత్తకోణంలో అధ్యయనాలు
యస్వీ భుజంగరాయ శర్మ తమ రచనలన్నిటినీ కలిపి రెండు సంకలనాలుగా వెలువరించారు. ఆకాశవాణిలో చేసిన ప్రసంగాలు, ఇతరత్రా ప్రచురించిన వ్యాసాలు, నృత్య రూపకాలు, గీతాలను ఇందులో సంపుటీకరించారు. చెన్నైలోని పచ్చయప్ప కాలేజీలో అధ్యాపకుడిగా జీవితాన్ని ప్రారంభించి, 'విశ్వోదయ' విద్యా సంస్థలో తెలుగు విభాగం అధిపతిగా, ఆ తరువాత ప్రిన్సిపాల్‌గా పనిచేసిన భుజంగరాయ శర్మ బహుముఖ ప్రజ్ఞాశాలి. కవిగా, విమర్శకుడిగా, నాటక రచయితగా ఆయన తెలుగు సాహిత్యానికి సేవలందించిన తీరు చిరస్మరణీయమైనది.
ఆయన అధికార భాషా సంఘం సభ్యుడిగా వ్యవహరించడమే కాకుండా ఆ తరువాత శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో తెలుగు అధ్యయన మండలి చైర్మన్‌గా కూడా తెలుగు భాషా పరిపుష్టికి ఎంతగానో సేవ చేశారు. ఆయనను ఆ విశ్వవిద్యాలయం డి.లిట్‌తో సత్కరించింది.
ఆయన రచించిన అనేక నృత్య రూపకాలను శ్రీ వెంపటి చినసత్యం కూచిపూడి నాట్య బృందం దేశ విదేశాల్లో ప్రదర్శించింది. అప్పుడు ఆ బృందంతో పాటు ఆయన కూడా అమెరికాలో పర్యటించారు. పట్రాయని సంగీతరావు, వెంపటి చినసత్యంలతో కలిసి కూచిపూడి 'త్రయం'గా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. వారు ముగ్గురూ కలిసి రాసిన శ్రీకృష్ణ పారిజాతం, చండాలిక, కల్యాణ శాకుంతలం, శ్రీనివాస కల్యాణం వంటి నృత్య రూపకాలు సంపూర్ణ రచనల్లోని రెండవ సంపుటంలో ఉన్నాయి.
ఎవరూ ఇంతవరకూ దృష్టి పెట్టడానికి సాహసించని పరిశోధనాత్మక అంశాలను ఎంచుకోవడం భుజంగరాయ శర్మ గొప్పతనం. ఇవి చాలా చిన్న అంశాలుగా పైకి కనిపించినా వీటికి పరిశోధన, అధ్యయనం ఎక్కువగా అవసరమవుతాయి. ఉదాహరణకు, ఒక భర్తను అర్థం చేసుకోవడమే కష్టసాధ్యమైన పరిస్థితిలో ద్రౌపది ఏకంగా అయిదుగురు భర్తలను ఎలా అర్థం చేసుకుందన్నది ఎవరికైనా ఆసక్తికరమే. ఆయన తన 'విధి వంచిత ద్రౌపది' అనే వ్యాసంలో ద్రౌపది మనోగతాన్ని అద్భుతంగా ఆవిష్కరించారు.
అదే విధంగా ఆయన శకుంతల, సత్యభామ, రాధ వంటి పాత్రలను కూడా విభిన్న కోణాల నుంచి విశ్లేషించారు. 'సమగ్రమైన వక్త, పరిపూర్ణమైన అధ్యాపకుడు, పరిణత చిత్ర లేఖకుడు' వంటి బిరుదులు ఉన్న శర్మ ఎంత గొప్ప పరిశోధకుడో కూడా ఈ వ్యాసాలు ప్రత్యేకంగా చెబుతాయి. ఈ నాయికల బాహ్య సౌందర్యం గురించి కాకుండా వారి అంతస్సౌందర్యానికి ఆయన పెద్ద పీట వేశారు. ఇక ఊర్వశి పాత్ర గురించి కూడా శర్మ అద్భుత విశ్లేషణ జరిపారు. పురాణ కథల్లో ఊర్వశి పాత్రను చిత్రీకరించిన తీరు నుంచి ఇటీవల రవీంద్రుడు, దేవులపల్లి కృష్ణశాస్త్రి, చలం వంటి వారు మలచిన తీరు వరకూ ఆయన వివిధ కవుల, భావ కవుల ఊర్వశి చిత్రీకరణను తన 'సాహిత్యోర్వశి' వ్యాసంలో ప్రత్యేకంగా ప్రస్తావిస్తూనే ఆమె ఏ విధంగా స్త్రీపురుషుల మధ్య తరగని ఆకర్షణకు, కరగని అనురాగానికి ప్రతిరూపంగా నిలిచిందో చక్కని పదజాలంలో వివరించారు.
ఆయన ఇటువంటి నాయికల పాత్రలను వివరిస్తూనే, కవి హృదయాన్ని కూడా పాఠ కుల ముందుంచుతారు. మొత్తానికి ఆయన ఈ రెండు సంపుటాల్లో రాసిన వ్యాసాలన్నీ ఒక కొత్త కోణాన్ని, ఓ కొత్త భావాన్ని వెల్లడిస్తాయి. కవితా వాల్మీకం, తిక్కన్నగారివి సూర్యోదయాలు రెండు, నన్నయ్యగారి నాటకీయత, చిత్రాంగి, సత్య, ఆత్రేయ పద్యకవిత, కృష్ణశాస్త్రి, ఆచంట శారదాదేవిగారి వానజల్లు వంటి వ్యాసాలన్నీ పాఠకులను, పరిశోధనాభిలాషులను ఓ కొత్త, వినూత్న తెలుగు సాహితీ ప్రపంచంలోకి తీసుకువెడతాయి.
- జి. రాజశుక(ఆదివారం ఆంధ్రజ్యోతి )
© 2017,www.logili.com All Rights Reserved.