కొడిగట్టిన సూర్యుడు
నున్నని నాపరాయిలా పరుచుకున్న నిశ్శబ్దంమీద
సరీసృపాల్లా జారుతోన్న రోగుల మూల్గుల మధ్య
నల్లని ఊడల మర్రిలా అల్లుకున్న చీకటిలోన
గుడ్లగూబల చూపుల్లా మండుతోన్న నక్షత్రాల కింద
చల్లని మంచు కురుస్తోన్న భూమిమీద
చైతన్యం గడ్డకట్టి వీచిన చలిగాలుల మధ్య
నిర్దాక్షిణ్యంగా కాలం వధించబడి
తలగడల కింద పూడ్చబడుతున్నప్పుడు
తాచులూ, రేచులూ, బూచులూ కలల్లో
స్వైరవిహారం సలుపుతున్నప్పుడు
నిద్రరాని తడికళ్ళమీద భవిష్యత్తు
వెలుగు అంచుల్లేని మేఘమై అల్లుకున్నప్పుడు
ఆలోచనలు చేసిన తిరుగుబాటులో ఓడిన యోధులు
మార్ఫియా నిద్రమందుతో బంధించబడినప్పుడు
అసంకల్పిత ప్రతీకార చర్యలో జారిన కన్నీళ్ళు
సంకల్పిత ప్రతీకార పరాభవానికి అద్దమైనప్పుడు
అందమైన మృత్యుచ్ఛాయల శీతల సమాధి రెండో అంతస్తులో
పాలిపోయిన గడ్డిపువ్వులా వెలుగురేఖవైపు వంగిన చూపుల్తో
సూటిగా వెలుతుర్ని చూడలేని కళ్ళను చిట్లించి
సన్నగా;
నిద్రలేక ఉబ్బిన కనురెప్పల్ని కిందకి వాల్చి.............
© 2017,www.logili.com All Rights Reserved.