ఈ కవి – తెగిపడుతున్న పక్షుల రెక్కల చప్పుడు వినగలడు. కెరటాలు చెప్పలేని అల్లకల్లోల దృశ్యాల పదధ్వనుల్ని పసిగట్టగలడు. సంక్షోభ సమయంలో ఆధునిక కవిగా, వార్తాపత్రిక రచయితగా రెండురంగాలనూ సమర్థవంతంగా నిర్వహిస్తున్నవారిగా తప్పకుండా పేర్కొనవలసిన వారు – కృష్ణుడు. కంటికి రెప్పలు లేని వాడే నేటి కవి. ఆధునిక కవి. ఆకాశాన్నీ, పక్షినీ కోల్పోతున్న వైనాన్ని నిశితంగా గమనిస్తూ రానున్న ప్రమాదంపై హెచ్చరిస్తున్న కవి, పహరా కవి దార్శనిక కవి కృష్ణుడు.. ఇది ఉద్యమాల స్థాయి గల సంపుటి.
చేతి వ్రేళ్ళు తగలని పుస్తకంలా కొట్టుకుంటున్న జీవితం
పరుగెడుతున్నారు మనుషులు వాహనాల్లా ఒక మాటా లేదు ముచ్చటా లేదు
మనసు తన్లాడుతోంది ఒక చిరునవ్వు పలకరింపుకోసం
శాసిస్తున్నాయి గడియారపు ముళ్ళు కలలనూ, ఆలోచనలనూ
కరచాలనానికి చేయిజాపే లోపే మాయమైన మనిషి
ఇక్కడిక్కడే అందరూ సమీపంలో ఉన్నదేదీ సన్నిహితం కాదు పెరుగుతోంది దూరం దగ్గరవుతున్నకొద్దీ
మనిషిని పోల్చుకోవడం కష్టం వాహనాలు, భవంతులూ, లైట్లూ రహదారుల మధ్య
రేపటి ప్రతిధ్వనులు కాలేవు నిన్నటి నినాదాలూ సభలూ..
పాడుబడిన గోడల మధ్య మొలిచిన మొక్కే నేటి సజీవ దృశ్యం
పక్షి ఆకాశం కోల్పోయింది నగరం చైతన్యాన్ని కోల్పోయింది.
© 2017,www.logili.com All Rights Reserved.