1. నేనిలా విన్నాను - ఒక సమయంలో భగవానుడు శ్రావస్తిలో, జేతవనంలో, అనాథపిండికుని ఆరామంలో ఉంటున్నాడు. అక్కడ ఆ భగవానుడు భిక్షువులను "భిక్షువులారా, అని సంబోధించాడు. “భదంతా” అని ఆ భిక్షువులు భగవానునికి బదులు పలికారు. భగవానుడు ఇలా అన్నాడు - "భిక్షువులారా, ప్రతీత్యసముత్పాదాన్ని ఉపదేశిస్తాను. మనస్సును చక్కపరచుకొని వినండి. చెపుతాను. “అలాగే భంతే” అని ఆ భిక్షువులు భగవానునికి బదులు పలికారు. భగవానుడు ఇట్లన్నాడు - "భిక్షువులారా, ప్రతీత్యసముత్పాదం అంటే ఏమిటి? భిక్షువులారా, అవిద్య కారణంగా సంస్కారాలు, సంస్కారాలు కారణంగా విజ్ఞానం, విజ్ఞానం కారణంగా నామరూపాలు, నామరూపాలు కారణంగా ఆరు ఆయతనాలు, ఆరు ఆయతనాలు కారణంగా స్పర్శ, స్పర్శ కారణంగా వేదన, వేదన కారణంగా తృష్ణ, తృష్ట కారణంగా ఉపాదానం (= పట్టుకోవటం) , ఉపాదానం కారణంగా భవం (=లోకం), భవం కారణంగా జన్మ, జన్మ కారణంగా జరామరణాలు, శోకం, విలాపం, దుఃఖం, అసంతోషం, నిరాశ కలుగుతాయి. ఈ విధంగా దుఃఖస్కంధం అంతా పుడుతుంది. భిక్షువులారా, ఇదే ప్రతీత్యసముత్పాదం అనబడుతుంది.
"అవిద్య ఏ మాత్రం మిగలకుండా, సంపూర్ణంగా నిరోధాన్ని పొందితే సంస్కారాలు నిరోధాన్ని పొందుతాయి. సంస్కార నిరోధం వలన విజ్ఞానం నిరోధాన్ని పొందుతుంది. విజ్ఞాన నిరోధంతో నామరూపాలు నిరోధాన్ని పొందుతాయి. నామరూప నిరోధంతో ఆరు ఆయతనాలు ( జ్ఞానేంద్రియాలు అయిదు + మనస్సు) నిరోధాన్ని పొందుతాయి. ఆరు ఆయతనాల నిరోధంతో స్పర్శ నిరోధాన్ని పొందుతుంది. స్పర్శ నిరోధంతో వేదన నిరోధాన్ని పొందుతుంది. వేదన నిరోధంతో తృష్ణ నిరోధాన్ని పొందుతుంది. తృష్ణానిరోధంతో ఉపాదానం నిరోధాన్ని పొందుతుంది. ఉపాదాన నిరోధంతో భవం నిరోధాన్ని పొందుతుంది. భవనిరోధం వలన జన్మ నిరోధాన్ని పొందుతుంది. జన్మ నిరోధంతో జరామరణాలు, శోకం, విలాపం, దుఃఖం, అసంతోషం, నిరాశ నిరోధాన్ని పొందుతాయి. ఇలా దుఃఖస్కంధం అంతా నిరోధాన్ని పొందుతుంది." భగవానుడు ఇలా అన్నాడు. సంతోషంతో భిక్షువులు భగవానుని మాటలను అభినందించారు. మొదటిది..............
© 2017,www.logili.com All Rights Reserved.