మనది దేవుళ్లను విశ్వసించే జాతి. మనం మానవ వ్యవహారా లన్నింటికీ ఆధ్యాత్మికంగానే మార్గదర్శకత్శం లభిస్తుందని నమ్మేవాళ్లం. కర్మ సిద్ధాంతాన్ని నమ్మేవాళ్లం. ఆయా దేశాలు చేసుకున్న కర్మలను బట్టే వాటి ఫలితం రాసిపెట్టివుంటుందని భావిస్తాం. ఎన్నో సుదీర్ఘ శతాబ్దాలుగా మన దురదృష్టాలకు మన కర్మఫలమే కారణమనుకుంటాం.
ఇప్పుడు మనం మన గతాన్ని తవ్వాలి. మనం ఎక్కడ పొరపాటు చేశామో నిర్భయంగా పరిశీలించాలి.
వాటిని ఎలా సరిదిద్దుకోగలమో ఆలోచించాలి.
మనం మన గతం తాలూకు ఊహాత్మక గొప్పదనంపై ఆధారపడి మాత్రమే ఒక ఆధునిక జాతిని నిర్మించాలని ప్రయత్నిస్తున్నాం తప్ప ప్రస్తుతం సాధించిన అంశాలపై ఆధారపడికాదు. మనల్ని మనం భ్రమల్లో ముంచెత్తుకుంటున్నామే తప్ప వాస్తవాల లెక్కలు తేల్చుకోవడంలేదు. మన బోధనాభ్యాస మంతా మనం మిగతా ప్రపంచ మానవాళి కంటే ఉన్నతమైన జాతి వారమని విశ్వసించే విధంగా సాగింది.
హిందువుల విషయంలో అన్ని అధికారాలూ ఒక చిన్న వర్గం చేతిలో శతాబ్దాలుగా వుంటూ వచ్చాయి.
ఆ దోపిడీదారుల జీవితం, ప్రయోజనాలు ఇప్పటికీ దేశంలోని అశేష ప్రజల ప్రయోజనాలకు నష్టదాయకంగా వున్నాయి. పవిత్ర గ్రంథాలూ, సామాజిక నిర్మాణం, మతసంస్థలూ, రాజ్యం అన్నీ వారి దోపిడీని కొనసాగించేందుకు అనుకూలంగా రూపొందాయి. ఇప్పటికీ అవి ప్రజలను అజ్ఞానంలో ముంచెత్తి, వారిని అనైక్యులను చేసి, బానిసత్వంలో మగ్గేలా చేస్తున్నాయి.
బ్రాహ్మణ వాదం కేవలం బ్రాహ్మణులకు మాత్రమే పరిమితమైనది కాదు. ప్రారంభించి ప్రచారం చేసింది బ్రాహ్మణులే అయినప్పటికీ అది వారికే పరిమితమై లేదు. రాను రాను ఇతర హిందూ కులాలు, విదేశీ దండయాత్రికులు, రాజులు దాన్ని సమర్థించి తమ స్వంత ప్రయోజనాలకు వాడుకున్నారు. తమ దండయాత్రలకు, దోపిడీకి బ్రాహ్మణవాదం తోడ్పడటంతో దానిని వారు ప్రోత్సహించారు. తద్వారా బ్రాహ్మణ వాదం శక్తివంతమైన వాదంగా ఎదగడానికి దోహదపడ్డారు.
కుల వ్యవస్థనీ, పౌరోహిత క్రతువులనూ అందరు దోపిడీదారులూ ఉపయోగించుకున్నారు.
బ్రిటీష్ సామ్రాజ్యవాదం సైతం మార్పునకు గురవుతోంది. కానీ బ్రాహ్మణ సామ్రాజ్యవాదం మాత్రం ఏ మార్పూ లేకుండా ఎప్పటిలా క్రూరంగా వుంది. తన మరణాంతక పట్టును ఏ మాత్రం సడలించకపోగా తన బరువు కింద బాధితులు నలిగిపోయి మరణించేట్టు చేస్తుంది. ఆరుకోట్ల మంది అస్పృశ్యులు హిందూ వాదాన్ని ఏకకంఠంతో నిరసించినా సరే అది తన పట్టును వీడదు. హిందూ సమాజం అంగాంగం ముక్కలు ముక్కలై పోతున్నాసరే దేవాలయాల ద్వారాల వెనుక బ్రాహ్మణమతం వర్థిల్లుతూనే వుంటుంది. భారతదేశం చచ్చినా బతికినా దానికేమీ లెక్కలేదు.
-------
స్వామి ధర్మతీర్థ (1893-1978) అసలు పేరు పరమేశ్వర మీనన్. కేరళలోని ప్రఖ్యాతి గాంచిన హిందూ పుణ్య క్షేత్రమైన గురువాయూర్‌లోని ఒక అగ్రవర్ణ శూద్ర (నాయర్) కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి సనాతన హిందువు. వృత్తి రీత్యా న్యాయవాది. కుల వ్యవస్థ పట్ల అచంచలమైన విశ్వాసం గలవాడు. అస్పృశ్యతను పాటించేవాడు. పరమేశ్వర మీనన్ చిన్నతనం నుంచే కులవ్యవస్థను, అంటరానితనాన్ని నిరసిస్తూ స్వంత ఇంటిలోనే తిరుగుబాటుదారుడుగా మారాడు.
కేరళలో వెనుకబడిన ఈళవ కులానికి చెంది సంఘ సంస్కర్త శ్రీనారాయణగురు బోధనలతో ఆయన ఎంతగానో ప్రభావితుడయ్యారు. శ్రీనారాయణ గురు ఆశ్రమంలో చేరి రెండేళ్లలోనే స్వామి ధర్మతీర్థగా మారిపోయారు.
పదేళ్లపాటు శ్రీనారాయణగురు ప్రబోధాలను ప్రచారం చేసిన అనంతరం ఆయన ఆశ్రమాన్ని విడిచిపెట్టి కాలినడకన పరివ్రాజకుడై ప్రయాణిస్తూ భిక్షాటన చేస్తూ దేశంలోని అన్ని దేవాలయాలను సందర్శించారు. ఈ క్రమంలోనే హిందువుల గురించీ, హిందూ మతం గురించీ, కుల దౌష్ట్యం గురించీ క్షుణ్ణంగా తెలుసుకున్నారు. హిందూ దేవాలయాలే ఈ మూఢవిశ్వాసాలకు, దోపిడీకి, అనైతికతకూ మూలకేంద్రాలన్న అవగాహనకు వచ్చారు. ఆయన రాజమండ్రి ఆశ్రమంలో వుండగానే హిందూమతంపై తన పరిశోధనను కొనసాగించారు. ఎట్టకేలకు తన రాత ప్రతితో బయటకు వచ్చారు.
ఆయన రాసిన ఈ పుస్తకం తొలుత ది మెనేస్ ఆఫ్ హిందూ ఇంపీరియలిజం పేరిట 1941లో లాహోర్‌లో వెలువడింది.
బ్రాహ్మణవాద హిందూమతంతో సుదీర్ఘకాలం పెనుగులాడి పోరాటం చేసిన తర్వాత తాను ఇంకెంతమాత్రం హిందువుగా కొనసాగలేనని గ్రహించి తన 56వ యేట హిందూమతాన్ని శాశ్వతంగా విడిచిపెట్టారు. చివరికి ఆయన 1978లో హిందూయేతరుడిగానే మరణించారు. స్వామి ధర్మతీర్థ తన జీవితాన్ని కరిగించి చరిత్రను మధించి సారాన్ని వడపోసి రూపొందించిన ఈ పుస్తకాన్ని మనకు కానుకగా అందించారు.
హిందూ సామ్రాజ్యవాద చరిత్ర
- స్వామి ధర్మతీర్థ
© 2017,www.logili.com All Rights Reserved.