తెలుగు సాహిత్య వాతావరణానికి ముకుంద రామారావు గారు ఒక గొప్ప ఉపకారం చేశారు. నోబెల్ బహుమానపు మహద్ద్వారం తెరిచి, ఆ బహుమానం పొందిన కవిత్వంలో ఏం జరిగిందో కళ్ళు మిరుమిట్లు గొలిపేలా చూపించారు. 1901 నుంచీ 2011 వరకూ నోబెల్ బహుమానం అందుకున్న కవుల జీవితకథలు సంగ్రహంగా చెప్పి, వాళ్ళ కవిత్వంలో మచ్చుతునకలు కొన్ని అనువాదం చేసి అందించారు.
నోబెల్ బహుమానాలు ఇవ్వడంలో వున్న రాజకీయాలనీ, ఏమరుపాట్లనీ ఒదిలిపెట్టకుండా, సున్నితంగా చూపించారు. మూడువందల పేజీల్లో మనకి ఒక కవితా ప్రపంచాన్ని చూపించారు.
కవిత్వంలో ఇన్ని రకాల గొంతుకలు ఒక వ్యక్తి మనకు వినిపించడం తెలుగు సాహిత్యంలో ఇంతకుముందు జరగలేదు. అనువాదకుడు బహురూపి. మాంత్రికుడు. రకరకాల వ్యక్తుల మనసుల్లోకి పరకాయప్రవేశం చేయగల శక్తి గల వ్యక్తి. ఎవరి పద్యం అనువాదం చేస్తూంటే వాళ్ళ గొంతుకే తన కంఠంలోంచి వినిపించగల నటుడు. ముకుంద రామారావుగారు ఈ ప్రయత్నంలో సాధించిన విశేషం ఆధునిక తెలుగు సాహిత్యానికి ఒక అపూర్వమైన బహుమానం.
...వెల్చేరు నారాయణ రావు
మంచి నోబెల్ కవిత్వం
సాహిత్యంలో నోబెల్ బహుమతి ఏ కొలమానం ప్రకారం లభిస్తుందన్న విషయం మనకు పెద్దగా చర్చనీయాంశం కానక్కర్లేదు. ఆ మాటకొస్తే జ్ఞాన పీఠ అవార్డులు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు ఇవ్వడానికి అనుసరించే కొలమానాలేమిటో మనకు ఇప్పటికీ అర్థంకాని విషయమే. బహుశా ప్రతి అవార్డు వెనుక ఎంతో కొంత వివాదం ఉండనే ఉంటుంది.
ఉదాహరణకు నోబెల్ శాంతి బహుమతి పొందిన వారిలో చాలామంది శాంతిదూతలేం కారు. అమెరికన్ అధ్యక్షులు ఒబామా, జిమ్మీ కార్టర్ లాంటి వారు అశాంతి బహుమతి పొందేందుకే అర్హులు అయినా వారికి శాంతి బహుమతులు దక్కాయి. అలాగే సాహిత్యంలోనూ వివాదరహితులకు, అర్హులకే నోబెల్ బహుమతి దక్కిందని అనుకోవడానికి వీల్లేదు. అయినప్పటికీ నోబెల్ సాహిత్య బహుమతి పొందిన కవులు, సాహిత్యకారులందరి ప్రమాణాలను శంకించలేం.
నోబెల్ కవిత్వంపేరుతో ముకుందరామారావు రాసిన పుస్తకంలో అనేక మంది గొప్పకవుల పరిచయాలు, కవిత్వాలు ఉన్నాయి. నోబెల్ కవులందరి భావజాలం ఒకటి కానే కాదు. వారిలో విప్లవకారులు, తాత్వికులు, ప్రకృతి ప్రేమికులు, తిరస్కృతులు, బహిష్కృతులు అన్ని రకాలూ ఉన్నారు. వీరిలో చాలామంది అద్భుతమైన కవిత్వాన్ని సృజించారు.
అనువాదాల ద్వారా కవి గొప్పతనాన్ని పూర్తిగా అంచనా వేయలేని మాట నిజమే. అనువాదాల ద్వారా అయితే ఈ అంచనా ఇంకా కష్టం. అయినప్పటికీ ముకుందరామారావు సాధ్యమైనంత మేరకు కవి జీవనాడిని పట్టుకునే ప్రయత్నం చేశారు.
ఈ ప్రయత్నంలో సఫలీకృతమయ్యేందుకు ఆయన బాగా అధ్యయనం చేశారన్న విషయం అర్థమవుతూనే ఉన్నది. ముందుమాట రాసిన వెల్చేరు నారాయణరావు తెలుగు కవుల గురించి కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఏ తెలుగుకవి నోబెల్ బహుమతి ఆశించారో ఆయనకు తెలిసి ఉంటుందని నేను అనుకోను. నోబెల్ కాదు, ఏ వీధి అవార్డు రాకపోయినా గురజాడ, శ్రీశ్రీ, ఉన్నవలక్ష్మీనారాయణ, జాషువా తదితరులు ప్రపంచంలో ఉన్నత ప్రమాణాలకు నిలవదగ్గ సాహిత్యాన్ని సృజించారని ఆయనకు చెప్పనక్కరలేదు.
ఎందుకంటే ఆయనే తెలుగులో ఉత్తమ సాహిత్యాన్ని ప్రపంచం దృష్టికి తీసుకువచ్చే గొప్ప ప్రయత్నం చేశారు కనుక. అయినప్పటికీ ఆయనకు తెలుగు కవుల గురించి తక్కువ అభిప్రాయం ఉన్నదంటే అర్థం చేసుకునే ప్రయత్నం చేయాల్సి ఉంది.ఆయన అన్నట్లు ముకుందరామారావు రాసిన ఈ పుస్తకం ప్రపంచ సాహిత్యం గురించి మన అవగాహన పెంచేందుకు ఎంతో తోడ్పడుతుంది.
© 2017,www.logili.com All Rights Reserved.