తింటానికి పనికొచ్చే పద్యాలు
నా పద్యాలు అప్పుడే తయారు చేసిన తాజా సరుకు లాంటివి.
మర్నాడు ప్రొద్దుటి దాకా నిలవుంటే, పాసిపోయి
తింటానికి పనికిరావు.
అందుకని ఆబగా వాటిని
కరకరలాడుతున్నప్పుడే కొరుక్కు తిను. లేకుంటే,
లోకం దుమ్ము వాటిమీద పడి పేరుకుపోతుంది.
పద్యం పుట్టుక ఎక్కడో తెలుసా?
ఇక్కడే, వెచ్చంగా వున్న ఈ గుండె గూటిలోనే.
బయట ప్రపంచంలో పడ్డదా
ఝంఝా మారుతానికి బలైపోతుంది.
గట్టున పడ్డ చేపపిల్ల
ఊపిరాడక చచ్చినట్లు.
తాజాగా వున్నప్పుడే నా పద్యాలు నీవు తిన్నా.
వాటికున్న చాలా అర్థాలు నీకు నువ్వే తెలుసుకోవాలి.
నిజం చెప్పాలంటే, ఓ మిత్రమా!
నీవు తినేది నీ వూహా చిత్రాల్నే..
పాతచింతకాయ పచ్చళ్ళను కాదు....................
© 2017,www.logili.com All Rights Reserved.