తెలుగు సాహిత్యంలో కథా ప్రక్రియకు ఉత్తరాంధ్ర అందించిన ఆణిముత్యాల్లో ఒకరు బలివాడ కాంతారావు. భాషాపరంగానూ, వస్తువురీత్యానూ ఉత్తరాంధ్ర జన జీవితం చిత్రించిన రచయితల్లో అగ్రేసరులు. వీరు సుమారు 300పైగా కథలూ, చినా, పెద్దా 32 నవలలూ రాశారు. అయిదు నాటికలూ - అనేకానేక శ్రవ్య నాటికలే కాకుండా రేడియో ప్రసంగాలనేకం చేశారు. “సంపంగి" నవల హిందీ, కన్నడ భాషల్లోకీ; 'ఇదే నరకం - ఇదే స్వర్గం" నవల హిందీ, ఇంగ్లీషు భాషల్లోకి అనువాదం పొందాయి. “ఇదే నరకం - ఇదే స్వర్గం" నవల హిందీ అనువాదాన్ని భారతీయ జ్ఞానపీఠ వారు ప్రచురించారు. ప్రసిద్ధ సృజనాత్మక రచయితగా కాంతారావుగారికి గుర్తింపు తెచ్చిన “దగాపడిన తమ్ముడు" నవలను నేషనల్ బుక్ ట్రస్టవారు అన్ని భారతీయ భాషల్లోకి అనువాదం చేయించి ప్రచురించారు. “అడవి మనిషి" నాటకం జాతీయ కార్యక్రమంగా ఆకాశవాణిలో అన్ని భారతీయ భాషల్లోనూ ప్రసారమయింది. వీరి కథలనేకం హిందీ సంకలనాల్లోనూ ప్రచురితమయ్యాయి.
1972లో "పుణ్యభూమి" నవలకు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు, 1986లో “వంశధార" నవలకు తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారాలు లభించాయి. సాహిత్యంలో కాంతారావుగారు చేసిన సేవలకు గుర్తింపుగా 1988లో గోపీచంద్ అవార్డు, 1996లో కళాసాగర్ మద్రాసువారి విశిష్ట పురస్కారం, రావిశాస్త్రి స్మారక పురస్కారం, 1998లో విశాలాంధ్ర ప్రచురణాలయం ప్రచురించిన “బలివాడ కాంతారావు కథలు" కథా సంకలనానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు లభించాయి. అనేక సాహితీ సంస్థలు పలు సందర్భాలలో వీరిని సత్కరించాయి.
బలివాడ కాంతారావు గారి రచనలపై ముగ్గురు సిద్ధాంత వ్యాసాలను రాసి పిహెచ్.డి. డిగ్రీలు, కొందరు యం.ఫిల్.డిగ్రీలు సంపాదించారు.
కళింగాంధ్ర జనం గుండె చప్పుళ్ళు వినిపించే రచయిత బలివాడ కాంతారావు.
© 2017,www.logili.com All Rights Reserved.