కాని ఇప్పుడు బద్దలైన మౌనంలో తుఫాను చూపిస్తాం! - కె. పి. అశోక్ కుమార్
మబ్బుల్లారా వెళ్ళిపోకండి ఇక్కడ కూడా కురవండి
మా వాడలు కూడా ఈ దేశంలో ఒక భాగమే
గత స్మృతుల మీద ఎవరైనా శవ వస్త్రం కప్పండి
అప్పుడప్పుడు అవి లేచి మమ్మల్ని భయ పెడుతున్నాయి
మా దేశంలోనే మీ వలస దాడులకి గురి అయ్యాం
మీరు పౌరులుగా మేము శరణార్థులుగా మిగిలిపోయేo
గుడి గుండెల్లో మేము కూడా ప్రేవేశం అడిగేo
కాని దేవుళ్లకే కాదు మనుషులకి కూడా దూరమయ్యాం
అద్దె కొంపలు సైతం మమ్మల్ని తిరస్కరించాయి
సత్రాలు కూడా బైటకు విసరి మమ్మల్ని సత్కరించాయి
కుళాయి నీరు మురికి కాలవల్లో ప్రవహించు గాక
మేం వాటిని దోసిట్లో అందుకుంటే దోషం అవుతుంది
ఒక చెంప మీద ఉమ్మితే నిన్న మరొక చూపించాం
కాని ఇప్పుడు బద్దలైన మౌనంలో తుఫాను చూపిస్తాం! - కె. పి. అశోక్ కుమార్