జీవితంలో కొన్ని అవకాశాలు మన జీవన గమనాన్నే మార్చేస్తాయి. సంవత్సరానికి కేవలం 2830 రూపాయలు ఫీజు కట్టి ప్రభుత్వ కళాశాలలో చదువుకున్న ప్రింటింగ్ టెక్నాలజీ చదువు నన్ను ఈ ప్రపంచంలో 12 దేశాల్లో పర్యటించడానికి దోహదం చేస్తుందని కలలో కూడా అనుకోలేదు. పోలాండ్‌లో మేనేజర్‌గా అవకాశం ఉంది, మీకు ఆసక్తి ఉందా? అంటూ ముంబై నుండి వచ్చిన ఫోన్ కాల్ నా జీవితాన్నే మార్చేసింది. పోలాండ్ యూరోపియన్ యూనియన్లో భాగం కావడంతో నేను అక్కడ పనిచేసిన కాలంలో జర్మనీ, స్వీడన్, ఇటలీ, లిచ్టేన్ స్టెయిన్, ఆస్ట్రియా, స్విట్జర్లాండ్, ఫ్రాన్సు, బెల్జియం, నెదర్లాండ్స్, చెక్ రిపబ్లిక్ దేశాల్లో పర్యటించటం జరిగింది.
అక్కడి సామాజిక, రాజకీయ, చారిత్రక అంశాల మీద లోతుగా అధ్యయనం చేసే అవకాశం దక్కింది. నేను సందర్శించిన దేశాల గొప్పతనాన్ని, అధ్భుతాలని, క్రమశిక్షణని, అక్కడి వ్యవస్థలని వివరించేటప్పుడు "అదే మన దేశంలో అయితేనా" అంటూ పోల్చి మన దేశాన్ని తక్కువ చేసే ప్రయత్నం ఎక్కడా చెయ్యలేదు. నేను అక్కడి వ్యవస్థలని చూసి గొప్పగా చెప్పినట్లే ఇతర దేశాల వాళ్ళు భారతదేశం గురించి అంతకన్నా గొప్పగా రచనలు చేశారు. ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశం అనిపించుకొనే ప్రతి దేశంలో వ్యవస్థలు, సౌకర్యాలు, అద్భుతాలు మనకీ ఉన్నాయి. కాకపోతే అవి చివరి వ్యక్తి వరకు చేరటంలోనే వైఫల్యం చెందుతున్నాం.
- రాజేష్ వేమూరి
© 2017,www.logili.com All Rights Reserved.