బి.ఎస్.రాములు (23-8-1949) సామాజిక తత్వవేత్త. సుప్రసిద్ధ రచయిత. 150కి పైగా కథలు, నవలలు రాశారు. 1992లో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రచయితల, కళాకారుల, మేధావుల ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షులు.
వీరి కృషి బహుముఖీనం. సామాజిక సాహిత్య, తాత్విక రంగాలలో నిరంతర కృషీవలుడు. 175కు పైగా గ్రంథాలకు పీఠికలు… 70 దాకా విభిన్న ప్రక్రియల్లో గ్రంథాలు.. వందలాది సాహిత్య, సామాజిక వ్యాసాల ద్వారా వీరు సుపరిచితులు.
1982లో ‘బతుకుపోరు’ నవలతోపాటు, ‘పాలు’, ‘స్మృతి’, ‘మమతలు- మానవ సంబంధాలు’, ‘వేపచెట్టు’, ‘తేనెటీగలు’, ‘బతుకు పయనం’ కథల సంపుటాలు ప్రచురించారు. 2002లో ‘మమతలు మానవసంబంధాలు’ సంపుటికి తెలుగు విశ్వవిద్యాలయం వారి పురస్కారంతోపాటు అనేక అవార్డులు అందుకున్నారు. ‘పాలు’ కథలసంపుటి ఆంధ్ర విశ్వవిద్యాలయం, కాకతీయ విశ్వవిద్యాలయంలో ఎం.ఏ. పాఠ్యాంశం.
1998లో వెలువడిన ‘కథలబడి – కథాసాహిత్య అలంకారశాస్త్రం’ గ్రంథం వందలాది యువ రచయితలకు మార్గదర్శకం… సాహిత్య, సామాజిక, సైద్ధాంతిక రంగాలలో విశేషకృషి చేసిన తనదైన ముద్ర వీరిది.
ఎన్నో కథావర్క్‌షాపులను నిర్వహించడం… తన పేరిట ‘విశాలసాహితి కథాపురస్కారా’లను 1998 నుండి 60కి పైగా సుప్రసిద్ధులతో పాటు, యువ కథకులకు అందించి సత్కరించడం… యువకథకులను తీర్చిదిద్దడం ద్వారా కథాసాహిత్యానికి తనవంతు సేవలను అందిస్తున్నారు.