ఫేస్ బుక్ పోస్ట్లు , స్క్రాపులు ,ఎస్.ఎం.ఎస్ లు, ఇ-మెయిల్సు , గ్రీటింగ్ కార్డ్లు ఇవన్నీ ప్రేమని వ్యక్తం చేసే విధానాలే కానీ ఒక్కోటి పుట్టి నాలుగు ఇదు సంవత్సరాలు హడావిడి చేసి సైలెంట్ అయిపోయాయి. కాని వీటన్నిటి కంటే ముందు పుట్టి శతాబ్దాలుగా విజయ విహారం చేస్తున్న "ప్రేమ లేఖ" గొప్పదనాన్ని వివరించే ఒక మంచి పుస్తకం ఈ " వెన్నెల్లో గోదావరి".
జామచెట్లకి జ్వరం రావడాలు ,
కోడలితో కబుర్లు చెబుతుంటే భద్రాచలం సీతమ్మ ముంగిట్లో ఉన్నట్లు ఉందనే అత్తగారు,
ఆత్మని ముద్దు పెట్టుకుని హృదయాన్ని కౌగలించుకునే తొలి రాత్రులు,
దెబ్బతగిలిన పిచ్చుక్కి కట్టు కట్టి తాటాకు బుట్టలో కర్చీఫులు వేసి గూడుని తయారు చేసే చిన్నపిల్లల పెద్ద హృదయాలు,
పెరట్లో కొబ్బరి చెట్టుకింద మంచం మీద పడుకుని వెన్నెల్లో మేఘం ఎక్కి అమెరికాలో ప్రియుని చెంతకు చేరాలనుకునే "పడుచు" కోరికలు,
ఇలాంటి ఎన్నో ఎన్నెన్నో మనసుని పులకిమ్పచేసి ఆత్మీయ అనుబంధాల పరిమళాల అక్షర చినుకుల జడివాన ఈ వెన్నెల్లో గోదావరి.
ప్రతీ విషయాన్నీ అపురూపంగా ఆస్వాదించటానికి ఆర్డినరీగా బ్రతికేయటానికి డిఫరెన్సు చెప్పే నవల.అమ్మమ్మలు, నానమ్మలు, తాతయ్యలు వ్రుద్దాస్రమాల్లో ఉంటే గత కాలపు కధలు, నీతులు, కబుర్లు ఎవరు చెప్తారు అని సూటిగా ప్రశ్నిస్తూ మన కష్టాలు విని సలహాలిచ్చే ఆ తరం వాళ్ళకన్నా గొప్ప డాక్టర్లు, సైక్రియాటిస్ట్లు లేరని తెలియచెప్పే ఒక మంచి ప్రయత్నం ఈ నవల.
ఆలుమగల మధ్య "మాటకి" "మౌనానికి" ఉన్న ఇమ్పార్టేన్సుని స్పృశిస్తూ "ప్రేమాక్షరం" ఎన్ని అద్బుతమైన అనుభూతుల్ని పలికిస్తుందో, అందిస్తుందో రుచి చూపించే ఒక పరమాన్నం (పరవాన్నం) లాంటి పుస్తకం.
పెళ్ళయ్యే ముందు ప్రతి మగవాడు ఈ నవలన్నా చదవాలి లేక నవలలో చెప్పినట్టు పెళ్లికి ముందు తన తల్లి అంతరంగమన్నా చదవాలి.
సినిమాటిగ్గా చెప్పాలంటే బాపు "ప్రేమ పుస్తకాన్ని" కృష్ణ వంశి "మురారి" ని కలిపి ఒక సినిమా తీయాలనుకుంటే దానికి వ్రాసుకునే ఫస్టు స్క్రిప్టుగా ఈ నవల ఉపయోగించుకోవచ్చు.
- డాక్టర్ ఎస్. వి . కే. చైతన్య
© 2017,www.logili.com All Rights Reserved.