కొంత కాలము మునుపు నాకో సంపంగి పువ్వునిచ్చితివీవు
నువ్విచ్చినా సంపంగి గాలిబ్ గజళ్ళ నడుమ కొలువుదీరె
పుటలు రెపరెపలాడినపుడెల్ల సంపంగి సౌరభాలు వెదజల్లు
నువ్వంపినా గులాబీలు సిగలోన సింగారించుకొని
అద్దమెదుట నిలుచుంటి నా సౌందర్యం చూచి మురియ
చిత్రం! అద్దమందు నా ప్రతిరూపము బదులు కాంచితి నీ మోము
నువ్వల్లినా మందార మాల మకరందము గ్రోల
తేనెటీగల సమూహము దండెత్తె నా ఇంటి వాకిట
ఆ పూమాలను కాపాడ తలుపు మూసితి, వెనుతిరిగిబోకు
దోసిట నిండా జాజులు పోసితివి ఓ వేకువ
ఆ జాజుల గుసగుసలు మోసిన వాయుతంత్రులను మీటి
పున్నమి వెన్నెలతో ఎన్ని కమ్మలంపితినో నీకు
గడ్డిపువ్వులూ గరిక పూజార్హమే అని తెలియజేసితివు
ఊహించని నీ ఆగమనం నేడు నాకు వసంతోదయం
నా ఇంటి ముందున్న పచ్చిక సైతం నీ పాదస్పర్శకై వేచె
లక్షమల్లెలతో అభిషేకమొనర్తునని మ్రొక్కుకొంటి నేను
మొక్కుతీరిన పిమ్మట ఆ మల్లెలదోనెపై తరలిపోయెద
అమృతస్మృతుల సుగంధాల నడుమ, తలవాల్చి నీ ఎదపై.................
© 2017,www.logili.com All Rights Reserved.