నేను రాసిన “నవలాశిల్పం” 1989లో వచ్చింది. విద్యార్థులు, విద్వాంసులూ దాని ఎంతో ఆదరంగా ఆహ్వానించారు. అది 1993లో పునర్ముద్రణ గూడా పొందింది. ఆ పుస్తకం ఇచ్చిన ఉత్సాహంతో “కథాశిల్పం" రాసి మీ చేతుల్లో పెడుతున్నాను.
"నవలాశిల్పం” నవల చరిత్రకానట్టే * కథాశిల్పం" కధ చరిత్ర కాదు. కథావస్తువునూ, కథాశిల్పాన్నీ, వాటి మధ్య ఉండవలసిన సంబంధాన్ని చర్చించటం ఈ పుస్తకం ఉద్దేశం. తెలుగు కథా రచయితల అధ్యయనానికి దోహదం చేస్తుందన్న ఉద్దేశంతో పాశ్చాత్య | కథాపరిణామాన్ని గురించి ఒక అధ్యాయాన్ని ఇందులో చేర్చాను.
ఈ పుస్తకాన్ని రాయటంలో మొహమాటాలకూ, మెప్పు మాటలకూ దూరంగా ఉండాలని ప్రయత్నించాను. అందుచేతనే నేను గౌరవించే రచయితల్లో కూడా తప్పులని నేను భావించిన వాటిని ఎత్తిచూపటానికి సంకోచించలేదు. అలాగే యువరచయితల్లో కనిపించిన మంచిని మెచ్చుకోవటానికి సందేహించలేదు.
దాదాపు పదేళ్ళుగా ఆశ్చర్యకరంగా వికసించిన తెలుగు కథ, వాడిపోతున్న లక్షణాలు కనిపిస్తున్నాయి. జీవితాన్ని, విశ్వకథా సాహిత్యాన్ని అధ్యయనం చేయటంలో యువరచయితలు శ్రద్ధచూపకపోవటం అందుకు ముఖ్యకారణమని నేను భావిస్తున్నాను. ఒకటి రెండు "మంచి" కథలు రాసిన కొంతమంది యువరచయితలు తమకొక జీవిత దృక్పధం లేకపోవటంచేతా, అధ్యయనం తక్కువ కావటంచేతా తమను తామే అనుకరించుకుంటున్నారు. వీరిలో కొందరు సాహిత్యాన్ని చదవాల్సిన అవసరం లేదంటున్నారు. మేము మనిషిని చదివి కథలు రాస్తామంటున్నారు. వీరు మనుషుల్ని ఏ దృక్పధంలో చదవాలనుకుంటున్నారో మనకు తెలియదు. బహుశా వారికీ తెలియదు.
మనిషిని అర్థం చేసుకోవటానికి శతాబ్దాలుగా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. మనిషికీ, సమాజానికి ఉన్న సంబంధాన్ని చర్చించే శాస్త్రాలు ఎన్నో ఉన్నాయి. ఈ సంబంధాన్ని కథలుగా మలచిన మహారచయితలు కూడా ఎందరో ఉన్నారు. ఆ శాస్త్రాలను గురించీ, ఆ రచయితలను గురించీ తెలుసుకోకుండా గొప్ప కథలు రాయగలమనుకోవటం వట్టి భ్రమ మాత్రమే. అలాంటి రచయితలు - తాము రాస్తున్న కథలకంటే గొప్ప కథల్ని చదవక పోవటంచేత - ఊబిలాంటి ఆత్మసంతృప్తిలో కూరుకుపోతున్నారు. తెలుగుకథ ఈ ప్రమాదానికి బలై పోకూడదన్న ఉద్దేశంతో చేసిన చిన్న ప్రయత్నం ఈ పుస్తకం.
పుస్తకానికి ప్రధాన పేరణ కా.రా. మాస్టారు గారిది, ఈ పుస్తకాన్ని నువ్వేరాయాలి - అని నన్ను వారు ప్రోత్సహిస్తూ వచ్చారు.
© 2017,www.logili.com All Rights Reserved.