పుట్టగానే పిల్లలు
పుట్టగానే పిల్లలు నవ్వరెందుకని
వాళ్ళు ఏ వెలుతురులో ఈదివచ్చారు
ఏ ఆనందాలు దాటి వచ్చారు
ఏ హద్దుల్లేని దేశాలు ఎగిరివచ్చారు.
పుట్టగానే పిల్లలు నవ్వలేరెందుకని
వాళ్ళు ఏ పవిత్రసీమలు విడిచివచ్చారు
ఏ దయాపూర్ణహస్తాలు విడిచిపెట్టారు
ఏ కపటంలేని కాలాలు పోగొట్టుకొన్నారు.
వాళ్ళంత వరకూ
ఏ జరామరణాల అంచుల్ని దాటి బ్రతికారు
ఏ భయరహిత ఏకాంతంలో సంచరించారు
ఒక్క మాటైనా, ఒక్క చూపైనా, ఒక్క మనిషైనా అక్కర్లేని
ఏ మహాశాంతి లోకాన్నుండి ఇక్కడికి జారిపోయారు
పుట్టగానే పిల్లలు ఎప్పుడూ ఏడుస్తారెందుకని
దుఃఖమయ ప్రపంచాన్ని వ్యాఖ్యానిస్తారెందుకని.....................
© 2017,www.logili.com All Rights Reserved.