దక్షిణ తీరంలోని
పాల్ఘాట్ కనుమల్లో
ప్రాచీన కాలపు వైభవ చిహ్నాలతో
మా పల్లె ఇప్పటికీ నాలో
సజీవంగా ఊపిరి పీలుస్తుంది.
ఆలియార్ నది ఒడ్డున
వెలిసిన మా అతుపొల్లాచి గ్రామం
నదీ సుందరి బుగ్గపైన
నల్లని దిష్టిచుక్కలా వుంది.
విధులుగా పిల్చుకునే
మట్టి బాటల పక్కన
వంకర టింకర వరుసల్లో కట్టిన గృహాలు
ఒక్కమాటలో చెప్పాలంటే
అవి బ్రహ్మరాక్షసుడి
బయటికి పొడుచుకొచ్చిన
దంతాల్లా ఉంటాయి.
- ఎన్. గోపి