అనగా అనగా కథలు
సాంప్రదాయం అనే ఎడారిలో హేతువు ఇంకిపోతే మిగిలేది.'తంతు 'మాత్రమే.కాని జానపద సాహిత్యం,కళలు అనేవి కాలం పరీక్షకు నిలిచి నిగ్గుతేలిన నికార్సయిన సంపద.ప్రత్యేకించి బాల సాహిత్యంలో జానపద కథలని చెప్పుకునే 'ఫోక్ టేల్స్’ఎంతోవిలువైనవి. ఇవి సార్వజనీనమైనవి,అన్ని కాలాల పిల్లలను అలరించేవి. అద్భుత ఊహా ప్రపంచంలోకి జానపద కథలు పిల్లల్ని తీసుకెళతాయి.భయంకొలిపే రాక్షసులు,మాట్లాడే పశు పక్ష్యాదులు,సొరంగ మార్గాలు,ఒంటిస్తంభం మేడలు,మాయలు మంత్రాలు ఈ కథల్లో కనిపిస్తాయి.అంతేకాదు వీటిల్లో అసూయద్వేషాలు,కుట్రలూ కుతంత్రాలు, మంచి చెడులు,ధైర్యసాహసాలు వంటివి ఉంటాయి.ఈ రకంగా ఈ కథలు పిల్లల్ని తమ అంతరంగంలోకి వెళ్ళేలా చేసి తాము ఎవరి పక్షాన ఉన్నారో తేల్చుకోమంటాయి.తమ కథా శిల్పంతో పిల్లల్ని మంత్రముగ్థుల్ని చేస్తాయి అందుకే ఈ కథలకు ఇంకా వన్నె తగ్గని ఆకర్షణ. 'మంచి పుస్తకం' 'అనగా అనగా కథలు' పేరుతో ప్రచురించిన వివిధ దేశాల జానపద కథలు 14 ఉన్నాయి.పుస్తకంలో ఇవి నార్వే,ఇటలీ,న్యూజిలాండ్,ఛెక్,రష్యా,చైనా, దక్షిణాఫ్రికా,స్పెయిన్,జావా,భారతదేశం,జపాన్,ఇంగ్లండ్ దేశాలకు చెందిన కథలు.ఈ జానపద కథల గొప్పతనం ఏమిటటే ఏ దేశపు పిల్లలు చదువుకుంటే అవి ఆ దేశపు కథలుగానే అనిపిస్తాయి.ఈ కథలు మన కథలు అనిపించటానికి మరో కారణం అబ్బూరి ఛాయాదేవి. ఇక్కడి పేర్లు పెట్టి పిల్లలకు అర్థమయేలా ఛాయాదేవి తెనిగించారు.1955ప్రాంతంలో మొదటిసారి ముద్రితమై ఇప్పటి కాలం పిల్లలను కూడా ఇవి ఆకర్షిస్తున్నాయంటే వీటి మూల కధాబలమూ,ఛాయాదేవిగారి శైలి జమిలిగా పనిచేశాయనటంలో సందేహం లేదు.కొచ్చర్ల వి.ఆర్ వేసిన లోపలి బొమ్మలు కథలకు సరిగ్గా అమిరాయి.
"సస్యసుందరి" లో దద్దమ్మ అనుకున్న రాజకుమారుడే అందరిలోకీ అందమైన భార్యని తెఛ్ఛుకున్నాడు.మొదట చెంచాలో పట్టేటంత చిన్నగా ఉన్న ఆమె జయశేఖరుని ప్రేమకు పూర్ణరూపం సంతరించుకుంది. అలాగే "శ్వేతభల్లూకం" అన్న కథలో ఎలుగుబంటి రూపంలో ఉన్న రాకుమారుడినీ, "మూషికరంథ్రం" అన్న కథలో కప్ప రూపంలో ఉన్న ప్రియురాలిని, ఆ కథలోని నాయికా నాయకులు తమ సహనం,శక్తి యుక్తులతో అందుకోగలుగుతారు.యక్ష ప్రశ్నలకు బదులిచ్చి తన తమ్ముళ్ళను సాధించుకున్న ధర్మరాజు మాదిరి 'బుద్దిబలం'అన్న కథలో రాక్షసుడి ప్రశ్నలకు బదులిచ్చి తన అన్ననే కాకుండా రాజకుమారిని భార్యగా పొందుతాడు.పందెంలో గెలిచినా బీద గొర్రెలకాపరికి తన కూతురిని ఇచ్చి పెళ్ళి చెయ్యగూడదనుకున్న కోయరాజు భంగపడిన విధానం 'పోయిన బల్లెం'లో కనపడితే,రాజగురువు తన శిష్యురాలయిన రాకుమారిని ప్రేమించి అమెను పొందుదామని కుట్ర పన్నుతాడు కాని,విఫలమవుతాడు.అలాగే 'వీరన్న శౌర్యం'లో సవతి తల్లి ద్వేషంగానీ,నావికుడి మోసంగానీ వీరన్నని తనదైన గమ్యం నుంచి దూరం చెయ్యలేకపోయాయి. దేవుడు వరమిచ్చినా పూజారి వరమివ్వడని అంటారు.కాని ఆ పూజారి పాత్ర మనలోని దురాశ పోషిస్తే ఏమవుతుందో'మూడు కోరికలు 'చదివితే తెలుస్తుంది.సముద్రం ఉప్పగా ఎందుకు ఉంది? ఒకప్పటి ప్రజలు తమ ఊహాశక్తి ఆధారంగా అల్లుకున్న కథే 'అసలు రహస్యం'.ఇలా చెప్పుకుంటూ వెళితే ఒక్కొక్క ఆణిముత్యం అవుతుంది.వాటి పరిచయాలు చాలించి అబ్బూరి ఛాయాదేవి శైలిలోని అసలు కథలులోకి వెళ్ళండి.
© 2017,www.logili.com All Rights Reserved.