మన రాష్ట్రంలో అన్ని చోట్ల ముస్లింలు హిందువులతో కలసిపోయి కనిపిస్తారు. అన్నదమ్ముల్లా, బంధువుల్లా ఒకరినొకరు వరుసలు పెట్టి పిల్చుకుంటారు. ఒకరి పండుగలకు ఒకరువెళ్లి, ఒకరిళ్లలో ఒకరు తింటారు.... తిరుగుతారు. ఒకరి ఆలయానికి ఒకరు వెళ్తారు. ఒకరి దేవుణ్ణి ఇంకొకరు కొలుస్తారు. ఇంతగా సమ్మిళితమైన సంస్కృతి బహుశా మరెక్కడా ఉండదేమో. కానీ సినిమాల్లో, మీడియాలో ముస్లింలను టెర్రరిస్టులుగా, దుర్మార్గులుగా చిత్రీకరిస్తున్నారు. మన చుట్టుపక్కల ఉన్న ముస్లింలు మీడియా ఊహిస్తున్న భీకరంగా, బీభత్సంగా అయితే లేరు. వాళ్లూ మనలాగే మనసున్న మనుషులుగానే మెదులుతున్నారు.
నిత్యం వివిధ వృత్తుల్లో, రోజువారి పనుల్లో మగ్గుతూ ఉండే వీళ్లూ 'మసీద్- మందిర్' అనే తేడాల్ని తమ దరిదాపులకు కూడా రానివ్వరంటే అతిశయోక్తి కాదు. అచ్చమైన పల్లెల్లోని ఇలాంటి 'తెలుగు ముస్లిం'ల జీవితాన్ని ఉన్నదున్నట్టుగా, నిజాయితీగా, నికార్సుగా అక్షరబద్ధం చేశాడు 'జుమ్మా' కథల సంపుటిలో వేంపల్లె షరీఫ్. రెండు విభిన్న సంస్కృతులను అతి చాకచక్యంగా మేళవించి కథలుగా మలిచి మెప్పించాడు.
''సాయిబులయితే సంక్రాంతి ముగ్గులెయ్యకూడదా? హిందువులైతే రంజాన్ బిర్యానీ తినకూడదా? ఏం ఎందుకు...? అని ప్రశ్నిస్తుంది 'ఆకుపచ్చ ముగ్గు' కథ. ముగ్గుకి, మెహిందీకి ముడిపెట్టి పాఠకుల మనసు నోటిని ఎర్రగా పండిస్తాడు వేంపల్లె షరీఫ్. బడి దొంగలున్నట్టు మసీదు దొంగలు కూడా ఉంటారని వాళ్లను పట్టుకుని వెంటబడితే కానీ మసీదుకెళ్లరని 'జుమ్మా' కథ చెబుతుంది. మతం మనం ఏర్పాటు చేసుకున్న వెసులుబాటు అని... మమతానురాగాలు ఎప్పటికైనా మతాన్ని ఓడిస్తాయని చాలా శక్తివంతంగా చెప్పిన కథ ఇది. మొదట 'జుమ్మా' చదివినప్పుడు ముస్లిం వ్యతిరేక కథ అని భ్రాంతి చెందుతాం. కానీ అందులో లోతును తరచిచూస్తే ఆ కథను అర్థం చేసుకోవాల్సిన తీరు బోధపడుతుంది.
'పర్దా' కథ ఒక సంచలనం. ఒక తరానికి మరో తరానికి మధ్య రాజుకున్న అగ్గి. మనిషి ఎదిగేకొద్ది లేనిపోని భయాలతో ఒక చట్రంలో పడి కొట్టుకుపోతాడని ఈ కథ చెబుతుంది. ఆ చట్రాన్ని ఎదిరించి నిలిచిన ఓ వృద్ధ వీర నారీమణి పాత్ర కళ్లలో నీళ్లయి ఇంకి కలకాలం నిలిచిపోతుంది.
'రజాక్ మియా సేద్యం' ఒక ముస్లిం రైతుకు సంబంధించిన కథ. పుస్తకం ముందు మాటలో కేతువిశ్వనాథ రెడ్డి చెప్పినట్టు కులమేదైనా, మతమేదైనా ఈ దేశంలో రైతు బతుకు ఎప్పుడూ దుర్భరమే. ఒక మామూలు రైతుకు ఎన్ని కష్టాలు ఉంటాయో... అన్ని కష్టాలు ఈ రజాక్‌మియాకు ఉంటాయి. వాటన్నిటికీ మించి కేవలం ముస్లిమైనందువల్ల మాత్రమే ఎదుర్కోవాల్సిన సమస్యల గురించి కూడా చర్చిస్తుంది ఈ కథ.
కథ ఏమైనా... అంతర్లీనంగా లౌకికతత్త్వం స్ఫురించేలా రాయడం షరీఫ్ ప్రత్యేకత. చాలా లోగొంతుకతోనే చాలా పెద్ద పెద్ద విషయాల్ని స్పృశిస్తాడు. రజాక్‌మియా భార్య పనికివెళ్లి ట్యాక్సి మీద నుంచి కిందపడి చనిపోతుంది. అది కూడా ఎలా అంటే ట్యాక్సి వెనకాల దుప్పటితో వేలాడుతూ, ఆ దుప్పటి ఎక్కడ గాలికి ఎగిరిపోతుందోనని భయపడి రెండు చేతులు వదిలేసి కిందపడి చనిపోతుంది. అంటే దుప్పటి - పనికెళ్లే ఆడవాళ్లకు ఎంత అవరోధమో చెబుతాడు. ఇదే రచయిత మరో కథ 'జుమ్మా'లో దుప్పటి లేక తల్లి చర్మం లేని మనిషి' అయ్యింది అంటాడు. అంటే మసీదు వైపుకెళ్లే ముస్లిం స్త్రీకి దుప్పటి ఎంత అవసరమో వివరిస్తాడు. మళ్లీ ఇదే రచయిత 'పర్దా' కథలో దుప్పటి అవసరం పల్లె మనుషులకు ఎందుకు లేదో చెబుతాడు. అంటే ఒక మత పద్ధతి ఒక్కోచోట ఒక్కోరకంగా ఎలా అనివార్యమవుతుందో, ఎలా నిరుపయోగమవుతుందో సందర్భానుసారంగా వివరించి వదిలేస్తాడు. మరి మనిషా... మతమా? అనేది తేల్చుకోవాల్సింది మాత్రం పాఠకులే.
తప్పిపోయిన కొడుకు ఆచూకీ తెలుసుకోవడం కోసం బుర్ఖా కప్పుకుని సాధువుల వెంట తిరుగుతుంటుంది ఓ ముస్లిం తల్లి 'అంజనం' కథలో. ఇక్కడ కూడా సమస్యే గెలుస్తుంది కానీ మతం కాదు. అయితే ఆ విషయాన్ని ఎక్కడా రచయిత తనకు తానుగా చెప్పడు. కథను చెప్పి వదిలేయడం వరకే తన పాత్రను నిర్వర్తించాడు. ఈ కథను కేవలం కథలుగానే చూడకుండా వీటిల్లోని పాత్రల తీరు- తెన్నులను వాటి వెనుక రచయిత ఆలోచనలు, భావాలను అర్థం చేసుకోగలిగితే ఈ పుస్తకం నిస్సందేహంగా మంచి పుస్తకం. అయ్యవారి చదువు, జీపొచ్చింది, చాపరాయి వంటి ముస్లిమేతర కథలు ఉన్నప్పటికీ అవి సంఖ్యలో తక్కువ కాబట్టి ఇది అచ్చమైన 'తెలుగు ముస్లిం' కథల సంకలనం. .....ప్రజా శక్తీ దిన పత్రిక
మన రాష్ట్రంలో అన్ని చోట్ల ముస్లింలు హిందువులతో కలసిపోయి కనిపిస్తారు. అన్నదమ్ముల్లా, బంధువుల్లా ఒకరినొకరు వరుసలు పెట్టి పిల్చుకుంటారు. ఒకరి పండుగలకు ఒకరువెళ్లి, ఒకరిళ్లలో ఒకరు తింటారు.... తిరుగుతారు. ఒకరి ఆలయానికి ఒకరు వెళ్తారు. ఒకరి దేవుణ్ణి ఇంకొకరు కొలుస్తారు. ఇంతగా సమ్మిళితమైన సంస్కృతి బహుశా మరెక్కడా ఉండదేమో. కానీ సినిమాల్లో, మీడియాలో ముస్లింలను టెర్రరిస్టులుగా, దుర్మార్గులుగా చిత్రీకరిస్తున్నారు. మన చుట్టుపక్కల ఉన్న ముస్లింలు మీడియా ఊహిస్తున్న భీకరంగా, బీభత్సంగా అయితే లేరు. వాళ్లూ మనలాగే మనసున్న మనుషులుగానే మెదులుతున్నారు. నిత్యం వివిధ వృత్తుల్లో, రోజువారి పనుల్లో మగ్గుతూ ఉండే వీళ్లూ 'మసీద్- మందిర్' అనే తేడాల్ని తమ దరిదాపులకు కూడా రానివ్వరంటే అతిశయోక్తి కాదు. అచ్చమైన పల్లెల్లోని ఇలాంటి 'తెలుగు ముస్లిం'ల జీవితాన్ని ఉన్నదున్నట్టుగా, నిజాయితీగా, నికార్సుగా అక్షరబద్ధం చేశాడు 'జుమ్మా' కథల సంపుటిలో వేంపల్లె షరీఫ్. రెండు విభిన్న సంస్కృతులను అతి చాకచక్యంగా మేళవించి కథలుగా మలిచి మెప్పించాడు. ''సాయిబులయితే సంక్రాంతి ముగ్గులెయ్యకూడదా? హిందువులైతే రంజాన్ బిర్యానీ తినకూడదా? ఏం ఎందుకు...? అని ప్రశ్నిస్తుంది 'ఆకుపచ్చ ముగ్గు' కథ. ముగ్గుకి, మెహిందీకి ముడిపెట్టి పాఠకుల మనసు నోటిని ఎర్రగా పండిస్తాడు వేంపల్లె షరీఫ్. బడి దొంగలున్నట్టు మసీదు దొంగలు కూడా ఉంటారని వాళ్లను పట్టుకుని వెంటబడితే కానీ మసీదుకెళ్లరని 'జుమ్మా' కథ చెబుతుంది. మతం మనం ఏర్పాటు చేసుకున్న వెసులుబాటు అని... మమతానురాగాలు ఎప్పటికైనా మతాన్ని ఓడిస్తాయని చాలా శక్తివంతంగా చెప్పిన కథ ఇది. మొదట 'జుమ్మా' చదివినప్పుడు ముస్లిం వ్యతిరేక కథ అని భ్రాంతి చెందుతాం. కానీ అందులో లోతును తరచిచూస్తే ఆ కథను అర్థం చేసుకోవాల్సిన తీరు బోధపడుతుంది. 'పర్దా' కథ ఒక సంచలనం. ఒక తరానికి మరో తరానికి మధ్య రాజుకున్న అగ్గి. మనిషి ఎదిగేకొద్ది లేనిపోని భయాలతో ఒక చట్రంలో పడి కొట్టుకుపోతాడని ఈ కథ చెబుతుంది. ఆ చట్రాన్ని ఎదిరించి నిలిచిన ఓ వృద్ధ వీర నారీమణి పాత్ర కళ్లలో నీళ్లయి ఇంకి కలకాలం నిలిచిపోతుంది. 'రజాక్ మియా సేద్యం' ఒక ముస్లిం రైతుకు సంబంధించిన కథ. పుస్తకం ముందు మాటలో కేతువిశ్వనాథ రెడ్డి చెప్పినట్టు కులమేదైనా, మతమేదైనా ఈ దేశంలో రైతు బతుకు ఎప్పుడూ దుర్భరమే. ఒక మామూలు రైతుకు ఎన్ని కష్టాలు ఉంటాయో... అన్ని కష్టాలు ఈ రజాక్‌మియాకు ఉంటాయి. వాటన్నిటికీ మించి కేవలం ముస్లిమైనందువల్ల మాత్రమే ఎదుర్కోవాల్సిన సమస్యల గురించి కూడా చర్చిస్తుంది ఈ కథ. కథ ఏమైనా... అంతర్లీనంగా లౌకికతత్త్వం స్ఫురించేలా రాయడం షరీఫ్ ప్రత్యేకత. చాలా లోగొంతుకతోనే చాలా పెద్ద పెద్ద విషయాల్ని స్పృశిస్తాడు. రజాక్‌మియా భార్య పనికివెళ్లి ట్యాక్సి మీద నుంచి కిందపడి చనిపోతుంది. అది కూడా ఎలా అంటే ట్యాక్సి వెనకాల దుప్పటితో వేలాడుతూ, ఆ దుప్పటి ఎక్కడ గాలికి ఎగిరిపోతుందోనని భయపడి రెండు చేతులు వదిలేసి కిందపడి చనిపోతుంది. అంటే దుప్పటి - పనికెళ్లే ఆడవాళ్లకు ఎంత అవరోధమో చెబుతాడు. ఇదే రచయిత మరో కథ 'జుమ్మా'లో దుప్పటి లేక తల్లి చర్మం లేని మనిషి' అయ్యింది అంటాడు. అంటే మసీదు వైపుకెళ్లే ముస్లిం స్త్రీకి దుప్పటి ఎంత అవసరమో వివరిస్తాడు. మళ్లీ ఇదే రచయిత 'పర్దా' కథలో దుప్పటి అవసరం పల్లె మనుషులకు ఎందుకు లేదో చెబుతాడు. అంటే ఒక మత పద్ధతి ఒక్కోచోట ఒక్కోరకంగా ఎలా అనివార్యమవుతుందో, ఎలా నిరుపయోగమవుతుందో సందర్భానుసారంగా వివరించి వదిలేస్తాడు. మరి మనిషా... మతమా? అనేది తేల్చుకోవాల్సింది మాత్రం పాఠకులే. తప్పిపోయిన కొడుకు ఆచూకీ తెలుసుకోవడం కోసం బుర్ఖా కప్పుకుని సాధువుల వెంట తిరుగుతుంటుంది ఓ ముస్లిం తల్లి 'అంజనం' కథలో. ఇక్కడ కూడా సమస్యే గెలుస్తుంది కానీ మతం కాదు. అయితే ఆ విషయాన్ని ఎక్కడా రచయిత తనకు తానుగా చెప్పడు. కథను చెప్పి వదిలేయడం వరకే తన పాత్రను నిర్వర్తించాడు. ఈ కథను కేవలం కథలుగానే చూడకుండా వీటిల్లోని పాత్రల తీరు- తెన్నులను వాటి వెనుక రచయిత ఆలోచనలు, భావాలను అర్థం చేసుకోగలిగితే ఈ పుస్తకం నిస్సందేహంగా మంచి పుస్తకం. అయ్యవారి చదువు, జీపొచ్చింది, చాపరాయి వంటి ముస్లిమేతర కథలు ఉన్నప్పటికీ అవి సంఖ్యలో తక్కువ కాబట్టి ఇది అచ్చమైన 'తెలుగు ముస్లిం' కథల సంకలనం. .....ప్రజా శక్తీ దిన పత్రిక© 2017,www.logili.com All Rights Reserved.