కోటమ్మ దళిత యువతి . తమకు లొంగ లేదన్న కసితో ఆ ఊర్లోని సర్పంచ్ ముసలయ్య , ఆ ఊర్లో పూజారి శాస్త్రి తో కుట్రపన్ని ఆమెను బసివినిగా మార్చడం అనే ఈ నవలలో ప్రధాన సంఘటన మన హృదయాలను ద్రవింప జేస్తుంది . నవల ప్రారంభంలో హసీనాగా పరిచయమైనా స్త్రీయే కోటమ్మ అని తెలిసినప్పుడు మనం చాలా అశ్శర్య పడతాం . తన జీవితం ఎలాగు నాశనమైంది . తను ఎప్పుడో వడలిపోయి , తిరిగివచ్చి తన కూతురి జీవితాన్నైనా బాగు చెయ్యాలన్న పట్టుదలతో ఆమె సమాజంతో చేసిన పోరాటం ఆమె తెచ్చిన నిశభ్ధ విప్లవం ఎందరో దళితవర్గాలకు చెందినా స్త్రీలకు స్పురి దాయకంగా నిలుస్తుంది.
నిమ్న వర్గాలకు చెందిన యువతులను అగ్రవర్ణాలవారు తమ లైంగిక సుఖం కోసం బసివినులుగా మార్చే దుష్ట , దుర్మార్గ సంప్రదాయాన్ని చిత్రిస్తూ వి. అర్. రాసాని ఈ నవలను రచించాడు . రాయలసీమ ప్రాంతంలో బసివిని వ్యవస్తకు వ్యతిరేకంగా పోరాడిన స్త్రీల జీవితాలను రాయలసీమ ప్రాంత పలుకుబళ్ళతో ఎంతో సహజంగా పాటకుల హృదయాలను ద్రవించేలా చిత్రించిన రాసానిని హృదయ పూర్వకంగా అభినందిస్తున్నాను . ...... అంపశయ్య నవీన్
ఈ నవలలిక చతురలో వచ్చింది, మంచి పేరొచ్చింది . కన్నడంలోకి వెళ్లి, అప్పుడే రెండు కాపులు కాసింది . 'ముద్ర'ఇప్పటికే జనామోదం పొంది, తనని తను నిరూపించుకుంది . కన్నడ,హిందీ,తమిళ బాష లొకిఅనువాదమై ముద్రపడింది . ఇక సంతృపతకరమైన ముగింపునిచ్చింది. ముద్ర నవలని నడిపించిన తీరు అర్ధవంతంగా, ఆసక్తికరంగా సాగింది .
.... శ్రీ రమణ
అలనాడు 'చట్టపరమైన' లైంగిక దోపిడికి సమాజం పెట్టిన పేర్లు బసివి, మాతంగి, జోగిని, దేవదాసి, కన్నెరికం. పేరేదైనా దోపిడిలో తేడాలేదు. రాయలసీమ ప్రాంతంలో 'బసివి' పేరుతో నిరంతరం మోసపోతున్న దళిత స్త్రీల హృదయ ఘోషని అక్షర బద్దం చేసిన నవల ఇది. యుగాలు గడుస్తున్నా, తరాలు మారుతున్నా ఆచార, సంప్రదాయాల క్రీనీడలో జరుగుతున్న ప్రక్రియ మాత్రం ఒక్కటే - స్త్రీని వశపరుచుకోడానికి దేవుడ్ని అడ్డం పెట్టుకుని లైంగిక అకృత్యాలకు పాల్పడటం. ఒక కన్నెపిల్లని 'బసివి'గా తయారుచేయడంలో ఊరి / కుల పెద్దల నిరంకుశత్వాన్ని, ఆ అనాచారంలో సమిధలయ్యే కోటమ్మలాంటి స్త్రీల వెతలని 'ముద్ర'గా రాసి, పాఠకుల మనస్సుపై చెరగని ముద్ర వేశాడు రచయిత రాసాని. గతంలో కూడా కొందరు రచయితలు తమ దృష్టికి వచ్చిన 'జోగిని' జీవితాలని అవలోకించి, కొన్ని రచనలు చేశారు. ఉదాహరణకు నాగప్పగారి సుందరరాజు రాసిన 'నడిమింటి బోడెక్క బసివిరాలయ్యేదా!'. ఆ కథ కూడా రాయలసీమ ప్రాంతం నుండి వచ్చినదే.
బసివిరాలిగా మారిన కోటమ్మ ఆ ఊరి సర్పంచ్ కబంధ హస్తాలనుండి తప్పించుకున్నా సరే, నిత్యం ఎక్కడో ఒకదగ్గర లైంగిక హింసకు బలవుతూ, ఆ క్రమంలో కన్నమ్మ, హసీనాలుగా పేర్లు మార్చుకుని, ఒకానొక దశలో బొంబాయి వ్యభిచార గృహానికి అమ్మబడి, అక్కడినించి తప్పించుకుని వచ్చి, తోటి బసివిరాళ్లతో కలిసి ఉద్యమం లేవదీసి, తన కన్న కూతురుని బసివి కాకుండా కాపాడి, ఆమె ప్రేమించిన వాడితో పెళ్లిచేయడం .. టూకీగా ఈ నవల ఇతివృత్తమైనా, రెండు తరాల బడుగు జీవితాలని ఎంతో వేదనతో అవలోకించి, నైతికత ముసుగులో స్త్రీల మానప్రాణాలతో చెలగాటమాడుతున్న సమాజాన్ని నిలదీస్తాడు రచయిత. ఎందరు రచయితలు గళమెత్తినా, ఎన్ని స్వచ్ఛంద సంస్థలు పోరాడినా మారుమూల పల్లెల్లో ఇప్పటికీ కొనసాగుతున్న 'జోగిని' దురాచారం అంతరించేదెప్పుడని 'కోటమ్మ' తరపున వకాల్తా పుచ్చుకుని ప్రశ్నిస్తాడు.
© 2017,www.logili.com All Rights Reserved.