శ్రమే సంపదకంతకూ మూలమని అర్థశాస్త్రవేత్తలు వక్కాణిస్తున్నారు. ప్రకృతితోపాటు సంపద సృష్టికి మూలాధారం శ్రమే. శ్రమ దేన్నైతే సంపదగా మారుస్తుందో ఆ పదార్థాన్ని ప్రకృతి సమకూరుస్తుంది. కాని శ్రమ పాత్ర ఇంతకన్న అపారమైన విలువ కలది. మానవుని మనుగడ అంతటికీ ఇదే ముఖ్యమైన షరతు. అది ఎంత ముఖ్యమైనదంటే ఒక విధంగా శ్రమే మానవుని సృష్టించిందని చెప్పవలసివుంటుంది.
లక్షలాది సంవత్సరాలకు పూర్వం, ఇంకా నిర్దిష్టంగా నిర్ధారణకాని ఒకానొక యుగంలో, భూమి చరిత్రకు సంబంధించి భూవిజ్ఞాన శాస్త్రజ్ఞులు మూడవది అని పిలిచే భూయుగంలో, అందునా ముప్పాతిక మూడుపాళ్లు ఆ యుగాంతంలో, ఉష్ణమండలానికి చెందిన ఏదో ఒక ప్రదేశంలో - బహుశా ఇప్పుడు హిందూ మహాసముద్ర గర్భంలో కలిసిపోయిన ఒక మహా భూఖండంపైన - మిక్కిలి అభివృద్ధిచెందిన రూపంలో నరరూప వానరజాతి ఒకటి ఉండేది. మన ఈ పూర్వీకులను గురించి డార్విన్ ఇంచుమించుగా సరైన వర్ణన చేశాడు. వాటికి శరీరమంతటా రోమాలుండేవి, గడ్డాలుండేవి, మొనలుతేలిన చెవులుండేవి. అవి చెట్లపైన గుంపులుగా నివసిస్తూండేవి. *
చెట్లెక్కడంలో చేతులూ, పాదాలూ భిన్నమైన పనులను నిర్వహించాల్సి వుంటుంది. తమ జీవిత పద్ధతిని అనుసరించి చదునైన నేలపై కదలవలసివచ్చినప్పుడు, ఈ వానరాలు క్రమంగా నడకలో తమ చేతులను ఉపయోగించే అలవాటును కోల్పోయి, అంతకంతకు నిటారుగా నిలబడ్డానికి అలవాటు పడ్డాయి. వానరుడు మానవుడుగా పరివర్తన చెందే క్రమంలో ఇదే నిర్ణయాత్మకమైన ముందంజ..........
© 2017,www.logili.com All Rights Reserved.