అవును,
నా కవిత్వ సాధనలో చరణ చరణమూ
అతని ప్రభావం, పర్యవేక్షణ.
నా జీవితంలో నిమిష నిమిషమూ
అతని రక్షణ హస్తం, ప్రోత్సాహం నాకు
అతనిచ్చిన బలంతోనే
చూపిన అతని తోవ వెంటనే
ఈ నడక నాకీ నాడు -
మధురానంద కవితాకాశంలోనూ
దుర్గమ జీవన కీకారణ్యంలోనూ.
అతని నించి ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ ఎంత భావ సంపత్తిని, అనుభవాల్ని, ఎన్నెన్ని జటిలసత్యాల్ని జీర్ణించుకో యత్నించానో! అతని నీడలో దృష్టిలో యెదగాలనే తపనతోఎంత నలిగానో, ఎంత బలంగా నా గుండెల్నతను అల్లుకుని పోయాడో - ఎట్లా మాటలో, రాతలో, ఈ ఇరుకులో విడదీసి వ్యక్తం చేయగలను? -
తన Humorతో, నవ్వుతో, చిన్న పల్కరింపుల మా గుండె లోతుల్ని అధ్బుత వెలుగుతో నింపే చలాన్ని తన దిగులు పాటలతో, చూపులు నరనరమూ కాల్చి కోతపెట్టే చలాన్ని తనకి తానే సాటియై, తన వుజ్వల రచనల కన్న మహోజ్వలుడైన చలాన్ని అను నిమిషం నన్నూ, నా బలహీనాల్ని భరించి, నాబోటి అనేక క్షుద్ర హృదయుల నీచ లోహాల్ని శుభ్రపరిచేందుకు నిరంతర తపోవేదన పడే చలాన్ని -
ఎట్లా అర్ధం చేయగలను మీకు, reader !
శిష్యుడిగా తగనివాణ్నే అయినా
తను నా గురువనే భావనలోని
మహా సంతోషంతో
గర్వాతి గర్వంతో
the one and only
చలానికి -
నా భక్తినీ, కృతజ్ఞతనీ
నివేదించుకుంటున్నాను.....
.'....and back innto him
are raining
all those songs of his'
© 2017,www.logili.com All Rights Reserved.