స్వాతంత్య్రానంతర కాలంలో దళితులపై హంతక దాడులు జరిగిన కీలవేన్మణి, బెల్చీ, మోరిల్ జాన్‌పే, కారంచేడు, చుండూరు, మేళవలుపు, కంబాలపల్లి, జజ్జర్ మొదలైన దారుణ సంఘటనలకు కొనసాగింపే ఖైర్లాంజీ.
2006 సెప్టెంబర్ 29 నాడు మహారాష్ట్ర, మెహది తాలూకాలోని ఖైర్లాంజీ అనే మారుమూల గ్రామంలో సురేఖా భోట్‌మాంగే అనే మహిళనూ, ఆమె కూతురైన ప్రియాంకా భోట్‌మాంగేనూ వివస్త్రల్ని చేసి, నగ్నంగా ఊరేగించి, సామూహికంగా అత్యాచారం జరిపి హత్య చేశారు.
వారితోపాటు వారి కుమారులు రోషన్, సుధీర్‌లను కూడా దారుణంగా కొట్టి చంపారు.
ఈ పాపంలో గ్రామస్తులంతా పాలుపంచుకున్నారు.
తరువాత ఆ నాలుగు శవాలనూ తీసుకెళ్లి పక్కనే వున్న కాలువలో పడేశారు.
భోట్‌మాంగేలు దళిత కులానికి చెందినవాళ్లు.
జనం అప్పుడే వాళ్లని మరిచిపోయారు.
ప్రతిరోజూ సగటున ఇద్దరు దళితులు ఈవిధంగా హత్యకు గురయ్యే ఈ దేశంలో ఇదో మామూలు విషయమైపోయింది. స్వాతంత్య్రానంతరం మన దేశంలో జరిగిన కులపరమైన అత్యాచారాల్లోకెల్లా అత్యంత దారుణమైన ఖైర్లాంజీ సంఘటనను ఆనంద్ తెల్‌తుంబ్డె ఈ పుస్తకంలో నిశితంగా విశ్లేషించారు. మన చుట్టూ ఖైర్లాంజీలు పదేపదే ఏవిధంగా జరుగుతున్నాయో, ఎందుకు పునరావృతమవుతున్నాయో వివరించారు.
21వ శతాబ్దపు స్వతంత్ర భారతదేశంలో ఒక దళిత కుటుంబాన్ని బహిరంగంగా, సంప్రదాయికంగా ఊచకోతకోసిన సంఘటనపై ఆనంద్ తెల్‌తుంబ్డే చేసిన ఈ విశ్లేషణతో మన సమాజం ఎంత కుళ్లిపోయిందో అర్థమవుతుంది.
ఈ ఊచకోత వెనకవున్న కారణాలనూ, ఇలాంటి కిరాతకాలు జరగడానికి దోహదం చేస్తున్న సామాజిక, రాజకీయ అంశాలనూ, ప్రభుత్వ యంత్రాంగం, పోలీసు వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, సమాచార ప్రసార మాధ్యమాలు అన్నింటినీ ఎండగడుతుంది. సమాజంలో పశుప్రవృత్తి పెరగడానికి, ఆ తరువాత వాటిని కప్పిపుచ్చడానికి అవన్నీ ఎలా తోడ్పడుతున్నాయో వివరిస్తుంది.
భూస్వామ్య వ్యవస్థ అవశేషాలనో, అంతిమదినాలనో అభివర్ణించే పుస్తకం కాదిది.
భారతదేశంలో ఆధునికత అంటే అర్థమేమిటో తెలియజెప్పే పుస్తకం.
సమకాలీన భారతదేశంలో అత్యంత ముఖ్యమైన అంశాన్ని లోతుగా చర్చించిన పుస్తకం.
© 2017,www.logili.com All Rights Reserved.