రచయితలు పలు రకములు. సంచలన రచయితలు, పరిశోధనాత్మక రచయితలు, హాస్వ రచయితలు, శృంగార రచయితలు, నవరసభరిత రచయితలు... ఇలా అనేక అలంకారాల భూషితులై ఉంటారు. కానీ స్థూలంగా చూస్తే రచయితలు రెండే రకాలు- రాజ్యాశ్రిత రచయితలు, ప్రజా రచయితలు. అంతే. మధ్యేమార్గం అనేది ఒక ముసుగు మాత్రమే. ఏ క్షణాన అయినా అది జారిపోవచ్చు. మనుషులకు వాళ్లవైన జీవితాలను, చుట్టూ ఉన్న సమాజాన్ని ఈ రెండింటి మధ్య సంబంధాన్ని పరిచయం చేయగలిగేది ప్రజా రచయితలే. కటిక పూల మార్టిన్ గా పిలవబడే ఈ ఇండస్ మార్టిన్ రెండవ కోవకు చెందిన రచయిత. సాహిత్యం ఫిర్యాదు చెయ్యకూడదు, తిరుగుబాటు చెయ్యాలి అంటాడు లూసన్. ఇప్పటి వరకు మార్టిన్ ఏం రాసినా అది ఆధిపత్య భావజాలంపై తిరుగుబాటు చేసేదిగానే ఉండింది. అందులో భాగంగానే ఈ పాదిరిగారి అబ్బాయి కథలు మీ ముందుకు వచ్చాయి. ప్రపంచంలో ఎక్కడ ఏ అన్యాయం జరిగినా దానికి వ్యతిరేకంగా స్పందించే గుణం నీలో ఉందంటే నువ్ నా కామ్రేడవే అని కదా చే గువేరా చెప్పింది. ఆ లెక్కన అణిచివేత, వివక్ష, ఆధిపత్య ధోరణులకు లోనయ్యే ప్రతి సంఘ జీవికీ గొంతుక నిచ్చిన మార్టిన్ మనకు ఏమవుతాడు... Obviously he is our comrade-in-arms. తిరుగుబాటు రచయితలు, ప్రజా రచయితలు సున్నితమైన మానవ సంస్పందనలను మాత్రం ఒడిసిపట్టలేరు అని ఎప్పటి నుండో చెబుతున్న భట్టిప్రోలు పంచాయతీలను బదాబదలు చేసాడు మార్టిన్. ఇందులో తెర చిరిగెను అన్న కథ ఒక్కటి చాలు సౌందర్య శాస్త్రానికి కొత్త సొబగులు ఎలా అద్దాలో తెలుసుకోవడానికి. ఏ రచన అయినా అంతిమంగా విశాల ప్రజా సమూహానికి ప్రాతినిధ్యం వహించకపోతే అది ఏట్లో కొట్టుకుపోయే మా తాత ఉత్తరంలా మిగిలిపోతుంది... ఇవాళా రేపూ సాహిత్య యవనిక మీద గజ్జ కడుతున్న ఆధునికానంతర రచనలు, ద్రవీభూత ఆధునికానంతర రచనలు అన్నీ మార్టిన్ సృజించిన స్థానీయ రచనల ముందు బలాదూర్... పోయేస్... వేరే మాట లేదు అని మీరే అంటారు... ఈ పాదరి గారి అబ్బాయి కథలు చదివాక...
- సత్యరంజన్ కోడూరు
© 2017,www.logili.com All Rights Reserved.