రైలు పట్టాల శిల్పనైపుణ్యంగల నవల
రాళ్ళసీమగా పేరుపడిన ఈ గడ్డమీద, రాళ్లసందుల్లో నుంచీ కనిపించే కాస్తంత నేలను చీల్చుకునే శక్తివంతమైన చెట్లు మొలకెత్తుతాయి. వెర్రిముఖాలేసుకుని ఎర్రటి ఎండకు కాగిపోతూ, వర్షపు చినుకు కోసం ఎదురుచూసే ఎండిన ఈ ఎర్రనేలల్లోని గులకరాళ్ల సందుల్లోనుంచీ తొంగిచూసే చిరుచెట్లే చిగురాకుల్ని సింగారించుకుంటాయి. నిరంతర కరువులతో, కక్షలతో దువ్వదువ్వగా మారిన సీమబతుకులలో నుంచీ చిరుమందహాసాలు చిందిస్తూ కలం హలాలను భుజానేసుకుని సాహిత్యక్షేత్రాన్ని దున్ని దున్ని గట్టి గింజల్ని పండిస్తూ తాగునీటికి, సాగునీటికి కరువేగానీ గట్టి కవులకు కరువులేదని నిరూపిస్తూనే వున్నారు సీమకథకులు. ఒకవైపు ప్రపంచీకరణ పెనురక్కని విషపుచూపులకూ, మరోవైపు కాటక కఠోరపిశాచి కరాళనృత్యానికి చిన్నాభిన్నమైపోతున్న సంసార స్థితిగతులు, కడుపాత్రం కోసం కనాకష్టాలు అనుభవించే జనసమూహాల దీనదృశ్యాలు.
ఇలాంటి ఈ నిర్లక్ష్యనేల పైన కలంప్రాణులు తమ జనంకన్నీళ్లనీ, దారిద్ర్యాన్నీ సిరాగా వంచుకుని సాహిత్య సిరుల్ని పెంపుచేస్తూనే కథలకు, నవలలకు బాహుబలాన్ని చేకూరుస్తున్నారు. అందుకే నేటి కథా, నవలా కళలు కొత్త కొత్త నగిషీలు చెక్కుకుని ఇక్కడి బతుకాటను ప్రదర్శిస్తున్నాయి. ఈశప్త భూమిలో ఎన్ని పెన్నేటి మలుపులున్నాయో, దీన బతుకుల ముద్రలున్నాయో, కొండపొలాలున్నాయో దృశ్యమానం చేస్తున్నాయి. ఇక్కడి సాహిత్య శిల్పులు తమ కలాల ఉలులతో ప్రపంచ సాహిత్య కళాపీఠాన్ని వింతవింత సొబగులతో అలంకరిస్తున్నారు. దాన్ని, గర్వంగా తలెత్తుకొని నిలబడగలిగే విధంగా చెక్కిచెక్కి చెమర్చుతున్నారు. దాని ఉతృష్టోన్నతికి సీమబతుకుల మెతుకులతో, ప్రాదేశిక అస్తిత్వ బలద్రవంతో, కష్టాల కన్నీళ్ళ పౌష్టికఫలహారంతో తగిన శక్తిని చేకూరుస్తున్న సీమ కలం వీరుల్లో డాక్టర్ శాంతి నారాయణగారు ప్రథమ వరుసలో నిలబడుతూనే వున్నారు.
© 2017,www.logili.com All Rights Reserved.