‘తప్పటడుగు’ నవల సందేశాత్మక నవల. పిల్లలు, తల్లిదండ్రులు కలిసి చదుకోవలసిన నవల. ప్రేమ అనే పవిత్రమైన మాటకి అర్థం మారిపోయి, ఉద్రేకం, కామం, ఆకర్షణ అనేవి ప్రేమగా చెలామణి అయిపోతున్న ఈ రోజుల్లో, గంటి భానుమతిగారు చాలా మంచి నవలని, ఆలోచింపజేసే నవలని పాఠకులకు అందించినందుకు ఆమెను అభినందిస్తున్నాను. సాధారణంగా నవలల్లో సమస్యలు కనిపిస్తాయి. పరిష్కారాలు పాఠకులకే వదిలేయటం జరుగుతుంది. కానీ తప్పటడుగు నవల సమస్యని చూపటమే కాక పరిష్కారాన్ని కూడా చూపటం విశేషం.
పదోతరగతి, ఇంటర్ చదివే అమ్మాయి, అబ్బాయి ప్రేమించుకోవటం అంటే అది వయసుకి సంబంధించిందే కానీ మనసుకి సంబంధించింది కాదు కదా! పైగా ప్రేమే జీవితం అనుకోవటం, జీవితం అంటే ఏదో తెలియకపోవటంతో ప్రేమ తిని ప్రేమ తాగి బతికేయగలం అనే యవనపు పొంగులోంచి వచ్చిన ఆవేశం!! ఇవేవీ వాస్తవం కావు. ఏది వాస్తవమో తేల్చి చెప్పారు నవలలో సుష్మ తల్లి పాత్ర ద్వారా రచయిత్రి. అమ్మ, నాన్న సంపాదించి, పిల్లలే జీవితం అనుకుని, అన్నీ సమకూర్చేసి, మనం కష్టపడ్డాం, మన పిల్లలు కష్టపడటానికి వీల్లేదనే కుటుంబ వ్యవస్థని, ఒక్కసారి కదిలించి, ముందుచూపు ఉందని తెలుసుకోండనే హితబోధ ఉంది ఈ నవలలో. ఈ నవలలో ఇటు సుష్మ తల్లి, అటు విశాల్ తండ్రి వ్యక్తిత్వాలు తీర్చిదిద్దారు రచయిత్రి.
© 2017,www.logili.com All Rights Reserved.